Thursday, February 4, 2010

సుందుడు-ఉప సుందుడు

అనగా అనగా సుందుడు ఉపసుందుడు అనే అన్నదమ్ములిద్దరు ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ అందగాళ్ళు, చాలా బలశాలులున్నూ. ఇద్దరూ జీవితంలో పైకి రావాలనే తపన ఉన్నవాళ్ళు ; అధికారం కోసం గానీ గౌరవ మర్యాదల కోసంగానీ ఏమైనా చేసేవాళ్లు. ఇద్దరూ చాలా నియమనిష్ఠలతో బ్రహ్మ గురించి దీక్షగా తపస్సు చేశారు. అనేక సంవత్సరాల తర్వాత బ్రహ్మదేవుడు వారికి ప్రత్యక్షమై, వరాలు కోరుకొమ్మన్నాడు.

సుందోపసుందులు ఇద్దరూ బ్రహ్మదేవుడిని చూసి సంతోషపడ్డారు. కానీ ఉపసుందుడికి ఏం వరం అడగాలో తోచలేదు. అన్న సుందుడు ఇద్దరి తరుపునా ఆలోచించి ఇద్దరికీ చావులేకుండా ఉండాలని వరం కోరాడు. “అది సాధ్యం కాదు" అన్నాడు బ్రహ్మ. “వేరే ఏదైనా కోరండి, ఇస్తాను. ఉదాహరణకు, మిమ్మల్ని ఇతరులెవ్వరూ యుద్దంలో చంపకుండా వరం ఇవ్వగలను నేను. అయితే మీరిద్దరూ ఎప్పుడైనా కొట్టుకున్నారో, ఇద్దరూ చచ్చిపోతారు మరి ఆలోచించండి . నాయీ వరాన్ని ఎన్నడూ దురుపయోగం చెయ్యమని మాట ఇవ్వాలి అన్నాడు. సోదరులిద్దరికీ ఆ ఐడియా నచ్చింది. ' అలాగే కానిమ్మ ' న్నారు. ఇక వేరేఎవ్వరూ తమని ఓడించలేరని ఇద్దరూ పొంగిపోయారు. అయినా కొంతకాలం వరకూ వాళ్లిద్దరి ప్రవత్రనలో ఎలాంటి మార్పులు రాలేదు. తమ శక్తి గురించి ఇద్దరూ దాదాపు మరిచేపోయారు.

అయితే మెల్లగా వాళ్లిద్దరూ స్థానిక దొమ్మీల్లోను, కుస్తీలోను, రకరకాల యుద్ద విద్యల్లోనూ తమ సామర్థ్యాన్ని చూపటం మొదలెట్టారు. రాను రాను వాళ్లిద్దరి పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. ఆ దేశపు రాజు వాళ్లని ఆహ్వానించి సుందుడికి మంత్రి పదవి, ఉపసుందుడికి సేనాని పదవీ ఇచ్చాడు. వాళ్ల సాయంతో రాజు తన రాజ్యాన్ని విస్తరించి భూమండలాన్నంతా జయించాడు. అయితే త్వరలోనే ఆ రాజు సుందోపసుందుల బారిన పడాల్సి వచ్చింది. ఆ పైన సుందుడు రాజుకాగా, ఉపసుందుడు సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు.

సంపద, అధికారం ఉన్నవారు నీతిమంతులుగా ఉండటం కష్టం. సుందోపసుందులిద్దరూ ఇక రాక్షసులే అయ్యారు. తమకు నచ్చినది ఏదీ ఎవరిదగ్గర ఉన్నా దోచుకోవటం మొదలుపెట్టారు వాళ్ళు. రాజ్యాలు, బంగారం, మణిమాణిక్యాలు, స్త్రీలు వేటికీ భద్రత అనేది లేకుండా పోయింది. వాళ్లు దుశ్చర్యలకు బలైన వాళ్లంతా బ్రహ్మదేవుడి శరణుజొచ్చారు.

బ్రహ్మదేవుడు విష్ణుమూర్తినీ, శివుడినీ అడిగాడు- ఏమైనా చేయమని. అందరు దేవతలూ కలిసి ఆలోచించారు: "సుందోపసుందులను ఇతరులెవ్వరూ ఓడించలేరు. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటే తప్ప, ఈ భూమికి వాళ్ల భారం తగ్గదు". బాగా ఆలోచించిన విష్ణుమూర్తి, దేవతలందరి సాయంతో "తిలోత్తమ" అనే అందగత్తెను సృష్టించాడు. ఆమె శరీరంలోని ప్రతి కణంలోను-(నువ్వుగింజంత భాగంలో కూడా-) అందం తొణికిసలాడేట్లు తయారు చేశారు వాళ్ళు. ఆపైన ఆమెకు ఏం చేయాలో బోధించి పంపారు.

సుందోపసుందుల రాజధానిని చేరుకున్న తిలోత్తమ కొద్ది రోజుల వ్యవధిలోనే ఉపసుందుడి ఇల్లు చేరింది. రాజ్యంలోని ప్రతి దుర్మార్గుడూ ఆమె సౌందర్యాన్నే గానం చేయటం మొదలెట్టాడు. ఆమె తన సొంతం అయినందుకు ఉపసుందుడు ఎంతగానో గర్వపడ్డాడు. అయితే అతని సంతోషం ఎంతోకాలం నిలువలేదు. రాజభవనం నుండి సుందుడు కబురంపాడు- తిలోత్తమను తన పరం చేయమని. తను పెద్దవాడు గనుకనూ, రాజు గనుకనూ ఆమెపై తనదే అధికారమన్నాడు. అనుకున్నట్లుగానే, ఉపసుందుడు అందుకు ఒప్పుకోలేదు. తమ్ముని ఇంటికి వచ్చి చూసిన సుందుడిక ఆగలేక పోయాడు. అన్నాదమ్ముల పోట్లాట మెల్లగా మొదలై తారస్థాయికి చేరుకున్నది.

తిలోత్తమ వాళ్లిద్దరినీ శాంతపరచలేదు. తన అందాన్ని ఎరగా చూపి, ఆమె ఇద్దరినీ వేరువేరుగా ఊరించింది. ఇద్దరినీ ఒకరిపైకి ఒకరిని ఉసిగొల్పింది. పోలాడుతున్న సుందోపసుందులు ఒళ్లు మరిచిపోయారు. ఆయుధాలు బయటికి తీశారు. బాహా బాహీలో ఇద్దరూ చచ్చిపోయారు. దుర్మార్గుల పీడ విరగడ అయిందని అన్ని లోకాల జనులూ ఊపిరి పీల్చుకొని పండగ చేసుకున్నారు.

వచ్చిన పని అయిపోయినందున తిలోత్తమ స్వర్గం చేరుకున్నది!

జన్మ

పరమశివుని అర్ధాంగి ఉమాదేవికి ఎవరో చెప్పారు- జనక మరణ చక్రం గురించీ, సృష్టి ప్రారంభమైననాటినుండి ఈ చక్రం నిరంతరంగా ఎలా తిరుగుతూ ఉన్నదీనీ. ఆమెకు అదంతా గొప్పగా అనిపించింది- దానిగురించి ఇంకా తెలుసుకోవాలనే కోరిక కలిగింది.

ఒకనాడు ఆమె పరమశివుడిని అడిగింది- “నేను ఇప్పటివరకూ ఎన్ని జన్మలెత్తానో చెప్పగలరా, మీరు?” అని.

శివుడన్నాడు- “ఓ., వేల జన్మలు-అనేకానేక రూపాలు!" అన్నాడు శివుడు.

“ఇక ముందు కూడా నేను మళ్లీ మళ్లీ జన్మిస్తానంటారా?” అడిగింది ఉమ.

“బహుశ:- పుట్టవలసి రావచ్చు" అన్నాడు శివుడు.

“మీరు కూడా, మరి, అలా పుడుతూ, గిడుతూ ఉంటారా?” అన్నది ఉమ.

“ఉహు- లేదు- నేను ఆ నియమానికి ఆవల ఉన్నాను" జవాబిచ్చాడు శివుడు.

ఉమాదేవికి సరిగా అర్థం కాలేదు. స్పష్టీకరణ కోరింది శివుడిని. కానీ- "ఇది వివరించాలంటే చాలా సమయం కావాలి. విషయం కొంచెం క్లిష్టం కూడాను. అందుకని, నువ్వు దాన్ని అందుకునేందుకు సిద్దంగా ఉన్నప్పుడు- మళ్లీ ఎప్పుడైనా చెబుతాను లె"మ్మన్నాడు సదాశివుడు.

కొన్ని వారాలు గడిచాయి- 'జనన మరణ చక్రం' గురించి మరిచిపోలేదు ఉమాదేవి. శివుడు మాత్రం దాని ఊసే ఎత్తటం లేదు.

ఒకనాటి సాయంత్రం, శివుడు కొంచెం ఖాళీగా కనిపించినప్పుడు, ఉమాదేవి జనన మరణాల గురించి మళ్ళీ గుర్తు చేసింది. ఇక తప్పేట్లు లేదని, శివుడు వివరించటం మొదలుపెట్టాడు. మెడ క్రింద ఒక దిండును ఉంచుకొని, ఉమాదేవి మెల్లగా కుర్చీ వెనక్కి వాలింది. శరీరాన్ని సుఖంగా ఉంచి, శివుడు చెప్పేది వింటున్నది. ఆలోగా ఒక పిల్లి అక్కడికి వచ్చి, ఆమె కాళ్లను రాసుకొని ముడుచుకు కూర్చున్నది. శివుడు తన దారిన తాను చెప్పుకుంటూ పోతున్నాడు:

"జడమైన ఈ ప్రపంచంలో ఒక్క కణంగా ఉద్భవించింది ప్రాణం. ఆ కణంలోని జీవంలో జ్ఞానం జాగృతమైనది. ఆ జ్ఞానం నుండి మనసు ఉత్పన్నమైనది. కణపు రక్షణ కోసం శరీరం నిర్మితమైంది. ఆ ప్రక్రియలో అవయవాలు, ఇంద్రియాలు ఏర్పడ్డాయి. వాటికి- పరిసరాలకు మధ్య జరిగిన చర్యలతో ప్రతి చర్యలు మొదలైనాయి. వాటి నుండి ఇష్టాలు- అయిష్టాలు తయారయ్యాయి. ఆ యిష్టాలు - అయిష్టాల నుండి తృష్ణ, కోరికలు, భయాలు ఉత్ప్న్నమైనాయి. ఇవన్నీ కలగలసినప్పుడు, వీటన్నిటి సమాహారం నుండీ జననం కలుగుతున్నది. ఆ పైన వార్ధ్యక్యం, వ్యాధి, మరణం, దు:ఖం ఇవన్నీ జననాన్ని అనుసరించి వస్తాయి....”

-ఉమాదేవి ఇవన్నీ వింటూ నిద్రలోకి జారుకున్నది. ఈ సూక్ష్మ వివరాలన్నీ ఆమెకు అవసరం లేనివిగా తోచాయి. కానీ పిల్లి మాత్రం వింటున్నది- అందుకని శివుడు కొనసాగించాడు-

“ఈ జనన-మరణ చక్రాన్ని నిరంతరంగా తిప్పుతూండే యాంత్రిక శక్తి 'తృష్ణ '- కోరికే! మన కోరికలు, భయాలు మన మనసుల్నిండా ఆవరించుకొని, 'నిజమైన మనల్ని ' నిద్రపుచ్చుతాయి. పరిపూర్ణమైన వాస్తవంలో మనం కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రం చూస్తాం. చూసి, ఆ చిన్న ముక్కతో నిరంతరం ప్రవహించే ఊహాలోకాన్నే సృష్టించుకుంటాం. ఈ చక్రంనుండి విడివడాలంటే మనం కొంచెం ఉన్నతి చెంది, మన కోరికల్ని, భయాల్ని 'కల' గా గుర్తించాలి. అప్పుడిక పునర్జన్మ ఉండదు..”

వింటున్న పిల్లికి జన్మరాహిత్యం కల్గిందట!

ఉమాదేవి నిద్ర మాత్రం కొనసాగిందట!!

గురు నానక్ కథ

నానక్ తండ్రి కాలూరాం ఒక కిరాణా వ్యాపారి. పట్టణంలో పేరుగాంచిన దుకాణాల్లో వారి దుకాణం ఒకటి. పంట కాలంలో ఆయన రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి, దాన్ని నిలువ చేసి, సంవత్సరమంతా వినియోగదారులకు అమ్మేవాడు.

ఒకసారి తీవ్రమైన కరువు ఏర్పడి, పంటలు పండక, మార్కెట్లో ధాన్యపు కొరత ఏర్పడింది. ప్రభుత్వం వారు తమ గిడ్డంగుల్ని తెరిచి, ఉన్న ధాన్యాన్ని అందరికీ పంచేందుకు గానూ చౌకధరల దుకాణాల వ్యవస్థ నెలకొల్పారు.

కాలూరాం గారికి అలాంటి చౌకధరల దుకాణం ఒకటి ఇచ్చారు. అప్పుడు నానక్ వయస్సు సుమారు 15 సంవత్సరాలు.

ఒకరోజున గిరాకీలు మరీ ఎక్కువమంది ఉంటే, తండ్రికి సాయంగా నానక్ గూడా దుకాణపు పనిలోకి దిగాడు- లావాదేవీల్ని నమోదు చేసుకొని, గిరాకీలకు ధాన్యం కొలిచి ఇవ్వటం నానక్ పని.

దుకాణంలో వ్రేలాడదీసిన తక్కెడ చిన్నదికావటంతో, ప్రతివారికీ అనేక సార్లు తూచి పోయవలసి వస్తున్నది. తూచి పోసిన ప్రతిసారీ నానక్ పెద్దగా అది ఎన్నోదో అరచి చెప్తున్నాడు- ఏక్..దో...తీన్..అని.

ఒకసారి అల తూచిపోస్తూండగా అంకె పెద్దది అయింది- వన్...గ్యారహ్..బారహ్..ఆపైఒన తేరహ్ వచ్చింది. గట్టిగా "తేరా" అని అరిచిన నానక్ కు "తేరా" కు ఉన్న రెండో అర్థం గుర్తుకొచ్చింది. “తేరా" అంటే "నీది" అని అర్థం- “భగవంతుడిది" అని అర్థం.

ఇక ఆయనకు 'సర్వమూ ఆ భగవంతుడిదే' అని గుర్తుకొచ్చింది. “అంతా నీదే- తేరా" అని అర్థం. ఇక ఆయనకు 'సర్వం ఆ భగవంతుడిదే' అని గుర్తుకొచ్చింది. “అంతా నీదే-తేరా" దగ్గర ఆయన లెక్క ఆగిపోయింది.

తర్వాతంతా నానక్ ధాన్యాన్ని తూచి పోస్తూనే వచ్చాడు. కానీ ఆయన హృదయంలో లెక్కమాత్రం 'తేరా' దగ్గర ఆగిపోయింది. సర్వం మరచిపోయి, నానక్ ధాన్యం మొత్తాన్నీ ఇచ్చేశాడు- ఏమీ రాసుకోకుండానే.

“తేరా" అని అరచిన ఆ క్షణంలోనే నానక్ కు జ్ఞానం ఉదయించింది. పూర్తిగా పండిన పండు ఇక చెట్టును అంటుకొని ఉండదు- నేలరాలుతుంది. ఆ పైన దానిని ఒక్క క్షణం సేపు కూడా ఆపి ఉంచలేదు చెట్టు. పండుకూడా చెట్టుతో తన ఎడబాటును వెనుకకు మరల్చలేదు. నానక్ అనుభవం కూడా అటువంటిదే దాని అయి ఉండవచ్చు- అనేక జన్మలుగా ఆయన చేస్తున్న యాత్ర నాటితో ముగిసింది.
(మూలం: పర్తాప్ అగర్వాల్)

Friday, January 1, 2010

మాట నిల్పిన నల్లనయ్య

పట్టణపు పొలిమేరల్లో ఓ గుడిశలో నివసించేవాడు నర్సీ. పేదవాళ్ళూ, తిక్కవాళ్ళూ అతని చుట్టూ చేరి ఉండేవాళ్ళు ఎప్పుడూ. నర్సీ వాళ్ళతోటి అవీ ఇవీ మాట్లాడుతూ, నవ్వుతూ-నవ్విస్తూ ఉండేవాడు. ఉత్సాహం, ఆవేశం ఎక్కువైనప్పుడు అతను పాటలు పాడేవాడు. ఆ పాటల్లో భక్తిరసంతోబాటు తాత్విక అంశాలు పుష్కలంగా ఉండేవి. "ఇతరుల బాధని అర్థం చేసుకోగలవాడే నిజమైన భక్తుడు- వైష్ణవజనతో తేనే కహియె జె పీర్ పరాయీ జాణేరే" అని నర్సీ పాడే పాటలు గుజరాత్ రాష్ట్రం అంతటా బహుళ ప్రజాదరణ పొందాయి. అతనిని భక్తికవిగా భావించిన వాళ్లు అతన్ని చూసి పోయేందుకు వచ్చేవాళ్ళు- అలా వచ్చినవాళ్ళు కొందరు అప్పుడప్పుడూ ఆయనకోసం ఏ డబ్బో, తిండిసామాన్లో వదిలి వెళ్ళేవాళ్ళు. నర్సీ వెంటనే వాటిని అన్నింటినీ పేదసాదలకు పంచిపెట్టేసేవాడు. ఊళ్లో వాళ్ళంతా నర్సీని తిక్కవాడుగా పరిగణించి , అతని చేష్ఠలగురించి ఎగతాళిగా చెప్పుకునేవాళ్ళు. అతన్ని మామూలు పనులనుండి దూరంగా ఉంచేవాళ్ళు.

నర్సీ మెహతా ఉండే పట్టణానికి అవతల చాలా దట్టమైన అడవి ఒకటి ఉండేది. దానినిండా దోపిడీ దార్లు! వారిచేత చిక్కితే యాత్రీకులకు, ప్రయాణీకులకు దమ్మిడీ‌ మిగలదు. అందుకని, ఆ పరిసర ప్రాంతంలో 'హుండీ' అనే వ్యవస్థ ఒకటి ఏర్పడి ఉండేది. ప్రయాణీకులు ఏదైనా పట్టణంలో ఒక పెద్దమనిషి దగ్గర తమ రొక్కం మొత్తాన్నీ జమ చేసి, ఖాళీ జేబులతో ప్రయాణం చేసేవాళ్ళు. ఆపైన, వేరే పట్టణంలో ఎక్కడైనా డబ్బు కావలసి వచ్చినప్పుడు, అక్కడ ముందుగానే నిర్ణయించిన పెద్దమనిషి దగ్గరకు వెళ్లి, తమ వద్దనున్న హుండీ రసీదు చూపెడితే, వాళ్ళు నిర్ధారిత రుసుమును మినహాయించుకొని ఆ డబ్బును వాళ్ళకు అందజేసేవాళ్ళు. ఈ వ్యవస్థ వల్ల స్థానిక వ్యాపారులకు కొంత ఆదాయం లభించేది, యాత్రీకుల సొమ్ముకు రక్షణా దొరికేది.

ఒకసారి దూరప్రాంతపు ప్రయాణీకులిద్దరు ఆ దారిన పోవలసి వచ్చింది. అడవి మొదటికి వచ్చాక, వాళ్లకు తమ దగ్గరున్న డబ్బు గురించిన చింత పట్టుకున్నది. 'హుండీ' తీసుకొని ఉంటే బాగుండుననుకున్నారు. అప్పటికప్పుడు వాళ్లు- ఆ దగ్గర్లో- అట్లా 'హుండీ' ఇవ్వగలిగే పెద్దమనుషులు ఎవరున్నారని ఆరా తీయటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో వాళ్ళు కొందరు తుంటరి వాళ్ల పాలబడ్డారు. "వేరెవరో ఎందుకు? నేరుగా నర్సీ దగ్గరికే వెళ్ళండి. ఈ పట్టణంలో హుండీ‌ఇవ్వగలిగేంత పెద్ద షావుకారు నర్సీ ఒక్కడే. అడవిదాటిన తరువాత వచ్చే పట్టణాలన్నిట్లోనూ నర్సీతో వ్యాపారం చేసే బడా వ్యాపారులున్నారు చాలామంది. ఆయన వసూలు చేసే రుసుమూ తక్కువ, మీ సొమ్ముకు భద్రతా ఎక్కువ!" అని వాళ్ళు ప్రయాణీకులిద్దర్నీ నర్సీ ఉండే గుడిసె వైపుకు పంపారు, నవ్వుకుంటూ.

అట్లా వాళ్లిద్దరూ నర్సీ దగ్గరికి వెళ్ళారు. నర్సీ గుడిసె ముందంతా చాలామంది కూర్చొని ఉంటే, ప్రయాణీకులు 'ఈయనెవరో నిజంగానే పెద్ద షావుకారు' అనుకున్నారు. నర్సీ వాళ్ళను ప్రేమగా ఆహ్వానించి, కూర్చోబెట్టి గౌరవ మర్యాదలు చేశాడు. వాళ్లకు అతని మాట తీరు నచ్చింది. 'చాలా మర్యాదస్తుడు' అనుకున్నారు. తామెందుకు వచ్చామో చెప్పగానే, నర్సీ అన్నాడు- "అయ్యో, నేనసలు షావుకారునే కాను. ఎవరికీ ఎట్లాంటి హుండీలూ నేను ఇవ్వను. మీరు వెళ్ళే పట్టణాల్లో నాకు తెలిసిన వ్యాపారులంటూ ఎవరూ లేరు. నా పనంతా ఆ నల్లనయ్యతోటే- ఆయనే నాకు తెలిసిన అత్యున్నత షావుకారు! ఇక్కడా అక్కడా అనికాక, అన్నిచోట్లా ఉంటాడాయన. మీపనికోసం మీరు వేరే షావుకారునెవరినైనా వెతుక్కోండి" అని.

వచ్చినవాళ్ళిద్దరికీ ఎంత అబ్బురమైందంటే, నర్సీ చెప్పినదాన్నంతా వాళ్ళు అతని నిరాడంబరతకు సంకేతంగా భావించటం మొదలెట్టారు. ఎంతైనా నర్సీ గొప్ప షావుకారేననీ, హుండీ‌ ఇవ్వగల సమర్థుడేననీ వాళ్ళు అనుకున్నారు. కొంత సేపటికి వాళ్ళిద్దరూ తామే స్వయంగా ఒక హుండీ పత్రం రాసి, బలవంతంగా నర్సీచేత సంతకం పెట్టించుకొని, తమ దగ్గరున్న డబ్బునంతా నర్సీ చేతుల్లో‌పెట్టి చక్కాపోయారు. పోయేముందు వాళ్ళు నల్లనయ్య ఎక్కడుంటాడో అడిగారు నర్సీని- "ఆయనకి ఖచ్చితంగా ఓ చిరునామా అంటూ ఉండదు. ప్రతి జీవి హృదయంలోనూ ఆయన నివసిస్తుంటాడు. షావుకార్లందరికీ పెద్ద షావుకారు ఆయన!" అన్నాడు నర్సీ. వాళ్ళకి నర్సీ చెప్పేది అసలు అర్థంకాలేదు. అయినా, "అందరికీ తెలుసంటున్నాడులే, బహుశ: ఆ నల్లనయ్య షావుకారును చాలా సులభంగా కనుక్కోవచ్చేమో" అనుకున్నారు వాళ్ళు.

వాళ్లు వెళ్లిపోయాక నర్సీ తన చేతిలోని డబ్బునంతా అవసరాల్లో ఉన్న పేదవాళ్లకోసమూ, ఆకలిగొన్నవారి కడుపు నింపటంకోసమూ ఖర్చు చేసేశాడు. త్వరలో అతను తన దగ్గరికి వచ్చిన ప్రయాణీకుల గురించీ, వాళ్ళు తనకిచ్చిన డబ్బు గురించీ, వాళ్ళు రాయించుకున్న పత్రం గురించీ, వేరే ఊరు చేరుకున్నాక వాళ్ళ గతి ఏమిటన్నదాని గురించీ- సర్వమూ మర్చిపోయాడు!

ఇక ప్రయాణీకులిద్దరూ కులాసాగా అడవిని దాటేసి, వేరే పట్టణం చేరుకున్నారు. అక్కడ వాళ్ళు నల్లనయ్య షావుకారు గురించి అడిగితే, ఎవ్వరూ తమకు తెలీదుగాక తెలీదన్నారు. కొందరు ఎగతాళి చేసి, "నల్లనయ్య అంటే కృష్ణుడు- ఇక మీకు ఆ భగవంతుడే దిక్కు" అని జాలిగా నవ్వారు. అప్పుడుగాని ప్రయాణీకులిద్దరికీ నిజంగా‌ చెమటలు పట్టటం మొదలవ్వలేదు. ఆపైన దిక్కుతోచక, వాళ్లిద్దరూ ఒక తోటలోకి వెళ్ళి చతికిలబడి, ఒకళ్ళమొహాలు ఒకళ్లు చూసుకొని విచారపడ్డారు. ఇప్పుడేం చెయ్యాలని బాధ పడ్డారు. ఆ నీరసం, బాధలో వాళ్ళిద్దరూ అక్కడే పడి ఓ కునుకు తీశారు.

మెలకువ వచ్చేసరికి, ఒకాయన వాళ్ళ ప్రక్కన కూర్చొని, వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్నాడు. ఎవరో షావుకారు లాగా ఉన్నాడు. కులాసాగా, నవ్వుముఖంతో ఉన్న ఆ మనిషి, వీళ్లు లేవగానే "నా పేరు నల్లనయ్య" అన్నాడు. "మీరు నాగురించి వెతుకుతున్నారని ఎవరో చెబితే, ఇలా వచ్చాను " అన్నాడతను!

వీళ్లిద్దరికీ ప్రాణం లేచి వచ్చినట్లైంది. వెంటనే తమ దగ్గరున్న హుండీ పత్రాన్ని బయటికి తీసి చూపించి, తమకు అత్యవసరంగా ఆ డబ్బంతా కావాలన్నారు. వీళ్లకోసమే అన్నట్లు, ఖచ్చితంగా ఆ మొత్తాన్నే ఓ బట్టలో కట్టుకొని వచ్చి ఉన్నాడు నల్లనయ్య. అతను ఆ మూటను వాళ్ళకిచ్చి, వాళ్ళు డబ్బును లెక్కపెట్టుకునేదాకా కూర్చొని, తర్వాత మర్యాదగా శలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు.

ఆ తర్వాతి సంవత్సరం ప్రయాణీకులిద్దరూ మళ్లీ నర్సీ మెహతా ఉండే పట్టణానికి వచ్చినప్పుడు, ఆ యన్ని కలిసి, నల్లనయ్యతో తమ అనుభవాన్ని వివరించారు. మళ్ళీ ఇంకో హుండీ కావాలట, వాళ్లకు!

నర్సీకి నోట మాట రాలేదు. సాక్షాత్తూ ఆ కృష్ణుడే- ఆ నల్లనివాడే- వీళ్ళకు షావుకారులాగా కనబడ్డాడని ఆయన నిర్ఘాంతపోయాడు. "తెలీక, నిర్లక్ష్యం కొద్దీ తను వీళ్ల డబ్బును తీసుకుంటే, తన మర్యాద దక్కించేందుకు ఆ నల్లనివాడు ఎంత పని చేశాడు- ఎంత కష్టం నెత్తికెత్తుకున్నాడు!" అని సిగ్గు పడ్డాడు. "అలాంటి తప్పుపని మళ్ళీ చేయను" అని ప్రయాణీకులను మర్యాదగా సాగనంపాడు. అయినా ఈ సంగతి మెలమెల్లగా జనబాహుళ్యానికి తెలియవచ్చింది- నర్సీ భక్తి తత్పరతకు ఒక నిదర్శనంగా నిలిచింది.

(ఆంగ్ల మూలం: పర్తాప్ అగర్వాల్, 'స్టోరీస్ టు లివ్ బై')

ముందుమాట

ఇంగ్లీషులోగాని, హిందీలోగాని కథ చదువుతూ తెలుగులో రాయటం ఓ వ్యసనం అయిపోయింది ఈమధ్య. పాపం, మూలకర్తలు సంతోషపడతారో, బాధ పడతారో తెలీదుగానీ, నేను మాత్రం టకటకా స్వేచ్ఛగా అనువాదాలు చేసేస్తున్నాను. వాటిలో కొన్నిటిని, ముఖ్యంగా పిల్లలకు పనికొచ్చేవాటిని, కొత్తపల్లి పత్రిక (http://kottapalli.in) లో పెట్టాను. మరికొన్ని 'నారాయణీయం' బ్లాగులో ఉన్నై. ఈ మధ్య చేస్తున్నవాటిలో పిల్లల సందర్భాలకంటే, తాత్విక పరమైన కథలు ఎక్కువ ఉండటంతో, వీటిని వేరుగా పెడితే బాగుండుననిపించింది. నేరుగా పిల్లలకు పనికొచ్చేవాటిని ఇప్పటికీ కొత్తపల్లిలో పెడతాను. మిగిలినవాటిని అనువాధ కధా మంజరిలో ఉంచుతాను. :)