Friday, January 1, 2010

మాట నిల్పిన నల్లనయ్య

పట్టణపు పొలిమేరల్లో ఓ గుడిశలో నివసించేవాడు నర్సీ. పేదవాళ్ళూ, తిక్కవాళ్ళూ అతని చుట్టూ చేరి ఉండేవాళ్ళు ఎప్పుడూ. నర్సీ వాళ్ళతోటి అవీ ఇవీ మాట్లాడుతూ, నవ్వుతూ-నవ్విస్తూ ఉండేవాడు. ఉత్సాహం, ఆవేశం ఎక్కువైనప్పుడు అతను పాటలు పాడేవాడు. ఆ పాటల్లో భక్తిరసంతోబాటు తాత్విక అంశాలు పుష్కలంగా ఉండేవి. "ఇతరుల బాధని అర్థం చేసుకోగలవాడే నిజమైన భక్తుడు- వైష్ణవజనతో తేనే కహియె జె పీర్ పరాయీ జాణేరే" అని నర్సీ పాడే పాటలు గుజరాత్ రాష్ట్రం అంతటా బహుళ ప్రజాదరణ పొందాయి. అతనిని భక్తికవిగా భావించిన వాళ్లు అతన్ని చూసి పోయేందుకు వచ్చేవాళ్ళు- అలా వచ్చినవాళ్ళు కొందరు అప్పుడప్పుడూ ఆయనకోసం ఏ డబ్బో, తిండిసామాన్లో వదిలి వెళ్ళేవాళ్ళు. నర్సీ వెంటనే వాటిని అన్నింటినీ పేదసాదలకు పంచిపెట్టేసేవాడు. ఊళ్లో వాళ్ళంతా నర్సీని తిక్కవాడుగా పరిగణించి , అతని చేష్ఠలగురించి ఎగతాళిగా చెప్పుకునేవాళ్ళు. అతన్ని మామూలు పనులనుండి దూరంగా ఉంచేవాళ్ళు.

నర్సీ మెహతా ఉండే పట్టణానికి అవతల చాలా దట్టమైన అడవి ఒకటి ఉండేది. దానినిండా దోపిడీ దార్లు! వారిచేత చిక్కితే యాత్రీకులకు, ప్రయాణీకులకు దమ్మిడీ‌ మిగలదు. అందుకని, ఆ పరిసర ప్రాంతంలో 'హుండీ' అనే వ్యవస్థ ఒకటి ఏర్పడి ఉండేది. ప్రయాణీకులు ఏదైనా పట్టణంలో ఒక పెద్దమనిషి దగ్గర తమ రొక్కం మొత్తాన్నీ జమ చేసి, ఖాళీ జేబులతో ప్రయాణం చేసేవాళ్ళు. ఆపైన, వేరే పట్టణంలో ఎక్కడైనా డబ్బు కావలసి వచ్చినప్పుడు, అక్కడ ముందుగానే నిర్ణయించిన పెద్దమనిషి దగ్గరకు వెళ్లి, తమ వద్దనున్న హుండీ రసీదు చూపెడితే, వాళ్ళు నిర్ధారిత రుసుమును మినహాయించుకొని ఆ డబ్బును వాళ్ళకు అందజేసేవాళ్ళు. ఈ వ్యవస్థ వల్ల స్థానిక వ్యాపారులకు కొంత ఆదాయం లభించేది, యాత్రీకుల సొమ్ముకు రక్షణా దొరికేది.

ఒకసారి దూరప్రాంతపు ప్రయాణీకులిద్దరు ఆ దారిన పోవలసి వచ్చింది. అడవి మొదటికి వచ్చాక, వాళ్లకు తమ దగ్గరున్న డబ్బు గురించిన చింత పట్టుకున్నది. 'హుండీ' తీసుకొని ఉంటే బాగుండుననుకున్నారు. అప్పటికప్పుడు వాళ్లు- ఆ దగ్గర్లో- అట్లా 'హుండీ' ఇవ్వగలిగే పెద్దమనుషులు ఎవరున్నారని ఆరా తీయటం మొదలుపెట్టారు. ఆ క్రమంలో వాళ్ళు కొందరు తుంటరి వాళ్ల పాలబడ్డారు. "వేరెవరో ఎందుకు? నేరుగా నర్సీ దగ్గరికే వెళ్ళండి. ఈ పట్టణంలో హుండీ‌ఇవ్వగలిగేంత పెద్ద షావుకారు నర్సీ ఒక్కడే. అడవిదాటిన తరువాత వచ్చే పట్టణాలన్నిట్లోనూ నర్సీతో వ్యాపారం చేసే బడా వ్యాపారులున్నారు చాలామంది. ఆయన వసూలు చేసే రుసుమూ తక్కువ, మీ సొమ్ముకు భద్రతా ఎక్కువ!" అని వాళ్ళు ప్రయాణీకులిద్దర్నీ నర్సీ ఉండే గుడిసె వైపుకు పంపారు, నవ్వుకుంటూ.

అట్లా వాళ్లిద్దరూ నర్సీ దగ్గరికి వెళ్ళారు. నర్సీ గుడిసె ముందంతా చాలామంది కూర్చొని ఉంటే, ప్రయాణీకులు 'ఈయనెవరో నిజంగానే పెద్ద షావుకారు' అనుకున్నారు. నర్సీ వాళ్ళను ప్రేమగా ఆహ్వానించి, కూర్చోబెట్టి గౌరవ మర్యాదలు చేశాడు. వాళ్లకు అతని మాట తీరు నచ్చింది. 'చాలా మర్యాదస్తుడు' అనుకున్నారు. తామెందుకు వచ్చామో చెప్పగానే, నర్సీ అన్నాడు- "అయ్యో, నేనసలు షావుకారునే కాను. ఎవరికీ ఎట్లాంటి హుండీలూ నేను ఇవ్వను. మీరు వెళ్ళే పట్టణాల్లో నాకు తెలిసిన వ్యాపారులంటూ ఎవరూ లేరు. నా పనంతా ఆ నల్లనయ్యతోటే- ఆయనే నాకు తెలిసిన అత్యున్నత షావుకారు! ఇక్కడా అక్కడా అనికాక, అన్నిచోట్లా ఉంటాడాయన. మీపనికోసం మీరు వేరే షావుకారునెవరినైనా వెతుక్కోండి" అని.

వచ్చినవాళ్ళిద్దరికీ ఎంత అబ్బురమైందంటే, నర్సీ చెప్పినదాన్నంతా వాళ్ళు అతని నిరాడంబరతకు సంకేతంగా భావించటం మొదలెట్టారు. ఎంతైనా నర్సీ గొప్ప షావుకారేననీ, హుండీ‌ ఇవ్వగల సమర్థుడేననీ వాళ్ళు అనుకున్నారు. కొంత సేపటికి వాళ్ళిద్దరూ తామే స్వయంగా ఒక హుండీ పత్రం రాసి, బలవంతంగా నర్సీచేత సంతకం పెట్టించుకొని, తమ దగ్గరున్న డబ్బునంతా నర్సీ చేతుల్లో‌పెట్టి చక్కాపోయారు. పోయేముందు వాళ్ళు నల్లనయ్య ఎక్కడుంటాడో అడిగారు నర్సీని- "ఆయనకి ఖచ్చితంగా ఓ చిరునామా అంటూ ఉండదు. ప్రతి జీవి హృదయంలోనూ ఆయన నివసిస్తుంటాడు. షావుకార్లందరికీ పెద్ద షావుకారు ఆయన!" అన్నాడు నర్సీ. వాళ్ళకి నర్సీ చెప్పేది అసలు అర్థంకాలేదు. అయినా, "అందరికీ తెలుసంటున్నాడులే, బహుశ: ఆ నల్లనయ్య షావుకారును చాలా సులభంగా కనుక్కోవచ్చేమో" అనుకున్నారు వాళ్ళు.

వాళ్లు వెళ్లిపోయాక నర్సీ తన చేతిలోని డబ్బునంతా అవసరాల్లో ఉన్న పేదవాళ్లకోసమూ, ఆకలిగొన్నవారి కడుపు నింపటంకోసమూ ఖర్చు చేసేశాడు. త్వరలో అతను తన దగ్గరికి వచ్చిన ప్రయాణీకుల గురించీ, వాళ్ళు తనకిచ్చిన డబ్బు గురించీ, వాళ్ళు రాయించుకున్న పత్రం గురించీ, వేరే ఊరు చేరుకున్నాక వాళ్ళ గతి ఏమిటన్నదాని గురించీ- సర్వమూ మర్చిపోయాడు!

ఇక ప్రయాణీకులిద్దరూ కులాసాగా అడవిని దాటేసి, వేరే పట్టణం చేరుకున్నారు. అక్కడ వాళ్ళు నల్లనయ్య షావుకారు గురించి అడిగితే, ఎవ్వరూ తమకు తెలీదుగాక తెలీదన్నారు. కొందరు ఎగతాళి చేసి, "నల్లనయ్య అంటే కృష్ణుడు- ఇక మీకు ఆ భగవంతుడే దిక్కు" అని జాలిగా నవ్వారు. అప్పుడుగాని ప్రయాణీకులిద్దరికీ నిజంగా‌ చెమటలు పట్టటం మొదలవ్వలేదు. ఆపైన దిక్కుతోచక, వాళ్లిద్దరూ ఒక తోటలోకి వెళ్ళి చతికిలబడి, ఒకళ్ళమొహాలు ఒకళ్లు చూసుకొని విచారపడ్డారు. ఇప్పుడేం చెయ్యాలని బాధ పడ్డారు. ఆ నీరసం, బాధలో వాళ్ళిద్దరూ అక్కడే పడి ఓ కునుకు తీశారు.

మెలకువ వచ్చేసరికి, ఒకాయన వాళ్ళ ప్రక్కన కూర్చొని, వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్నాడు. ఎవరో షావుకారు లాగా ఉన్నాడు. కులాసాగా, నవ్వుముఖంతో ఉన్న ఆ మనిషి, వీళ్లు లేవగానే "నా పేరు నల్లనయ్య" అన్నాడు. "మీరు నాగురించి వెతుకుతున్నారని ఎవరో చెబితే, ఇలా వచ్చాను " అన్నాడతను!

వీళ్లిద్దరికీ ప్రాణం లేచి వచ్చినట్లైంది. వెంటనే తమ దగ్గరున్న హుండీ పత్రాన్ని బయటికి తీసి చూపించి, తమకు అత్యవసరంగా ఆ డబ్బంతా కావాలన్నారు. వీళ్లకోసమే అన్నట్లు, ఖచ్చితంగా ఆ మొత్తాన్నే ఓ బట్టలో కట్టుకొని వచ్చి ఉన్నాడు నల్లనయ్య. అతను ఆ మూటను వాళ్ళకిచ్చి, వాళ్ళు డబ్బును లెక్కపెట్టుకునేదాకా కూర్చొని, తర్వాత మర్యాదగా శలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు.

ఆ తర్వాతి సంవత్సరం ప్రయాణీకులిద్దరూ మళ్లీ నర్సీ మెహతా ఉండే పట్టణానికి వచ్చినప్పుడు, ఆ యన్ని కలిసి, నల్లనయ్యతో తమ అనుభవాన్ని వివరించారు. మళ్ళీ ఇంకో హుండీ కావాలట, వాళ్లకు!

నర్సీకి నోట మాట రాలేదు. సాక్షాత్తూ ఆ కృష్ణుడే- ఆ నల్లనివాడే- వీళ్ళకు షావుకారులాగా కనబడ్డాడని ఆయన నిర్ఘాంతపోయాడు. "తెలీక, నిర్లక్ష్యం కొద్దీ తను వీళ్ల డబ్బును తీసుకుంటే, తన మర్యాద దక్కించేందుకు ఆ నల్లనివాడు ఎంత పని చేశాడు- ఎంత కష్టం నెత్తికెత్తుకున్నాడు!" అని సిగ్గు పడ్డాడు. "అలాంటి తప్పుపని మళ్ళీ చేయను" అని ప్రయాణీకులను మర్యాదగా సాగనంపాడు. అయినా ఈ సంగతి మెలమెల్లగా జనబాహుళ్యానికి తెలియవచ్చింది- నర్సీ భక్తి తత్పరతకు ఒక నిదర్శనంగా నిలిచింది.

(ఆంగ్ల మూలం: పర్తాప్ అగర్వాల్, 'స్టోరీస్ టు లివ్ బై')

No comments:

Post a Comment