Saturday, April 7, 2018

టోబిన్ తలరాత!

ఓ హెన్రీ కథల్లో ముగింపులు అద్భుతంగా ఉంటాయి. మిగిలిన కథాభాగం అంతా ఒకింత వెటకారంతో, కొంచెం సాగబీకినట్లుండే వర్ణనతో ఒకలాగా సాగినప్పటికీ, కథల అంతాలు మటుకు కత్తివేటు వేసినట్లే- ధడాలున నెత్తి మీద పడతాయి, అకస్మాత్తుగా. మనసుపెట్టకుండా కథని పైపైన చదివే వాళ్ళు, ఈ అంతాల మెరుపుల్ని అసలు అర్థం చేసుకోగలరా, అనిపిస్తుంది ఒక్కోసారి.

టోబిన్ తల రాత!
మూలం: "టోబిన్స్ పామ్‌"
రచన: ఓ. హెన్రీ

అట్లా రేవు అవతలికి బయల్దేరాం, నేనూ-టోబినూ కలిసి: ఏమంటే మా ఇద్దరి దగ్గరా కలిపి నాలుగు డాలర్ల డబ్బులున్నాయి; అంతే కాక టోబిన్‌ మనసు ఏమంత బాగాలేదు- దానికి కొంత మరపు అవసరం అవుతున్నది. 
కథ ఏమంటే, కేటీ మహోర్నర్ అని, స్లిగో కౌంటీకి చెందిన అమ్మాయి ఒకతె ఉండేది- టోబిన్ ప్రియురాలు. ఆమె దగ్గర పొదుపు డబ్బులు ఒక రెండువందల డాలర్లుండినై. అప్పట్లోనే టోబిన్‌కు కూలిపోబోతున్న ఓ పాత ఇల్లు, బోగ్ షానాలో ఒక చక్కని పందికూనా వారసత్వంగా లభించాయి. వాడు ఆ తన ఆస్తినంతా అమ్మేస్తే ఒక వంద డాలర్ల వరకూ వచ్చాయి.
ఈ పిల్ల ఏం చేసిందంటే, తన రెండొందలు, వీడివి నూరు- మొత్తం మూడొందల డాలర్లనీ పట్టుకొని 'అమెరికాలో పని వెతుక్కుంటా'నని పోయింది మూడు నెలల క్రితం. ఆ తర్వాత వీడికి ఒక ఉత్తరం మాత్రం వచ్చింది ఆమె దగ్గర్నుండి- 'నేను మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తున్నాను' అని. అంతే- ఇక ఆ తర్వాత వేరే ఉత్తరాలూ లేవు; పిల్లా లేదు!
టోబిన్ ఆమె గురించి పేపర్లలో అడ్వర్టయిజుమెంట్లు ఇప్పించాడు, కానీ‌ ఆ అమ్మాయి జాడ తెలీనే లేదు-  అదీ, సంగతి. అట్లా మేమిద్దరం నది అవతలి ఒడ్డున ఉన్న కోనీస్‌కు పోవాల్సివచ్చింది:  'కోనీస్‌లో ఆ పొగల మధ్య, పాప్‌కార్న్ వాసనల మధ్య, ఆ హడావిడిలో ఒకటి రెండు పెగ్గులు వేసుకుంటేనన్నా వాడి గుండెబరువు కొంత తగ్గచ్చు' అని. 
కానీ మా టోబిన్ తల గట్టిది. దు:ఖం వాడి మనసులో ఆగక, శరీరాన్నంతా ఆక్రమించి ఉన్నది.  'నీళ్ల బుడగల్ని తుపాకీతో పేల్చే' ఆట దగ్గర వాడు పళ్ళు బిగబట్టుకున్నాడు;'కదిలే బొమ్మలు చూడరా' అంటే ఏదో గొణుక్కున్నాడు; 'తాగురా' అంటే 'ఏదైనా తాగుతానం'టాడు గానీ మరీ ఎక్కువ కిక్కు ఇచ్చేవాటి జోలికి పోడు; 'ఎవరైనా బక్కటోళ్ళు రారా, వాళ్లని నాలుగు దెబ్బలు వెయ్యనా' అన్నట్లు  ఊగిపోతున్నాడు.
అందుకని నేను వాడిని కొంచెం ప్రక్కకి తీసుకెళ్ళాను. మరీ అంత ఆకర్షణీయంగా లేకుండా, అంత హింసాయుతమైన ఆలోచనలు కలిగించని స్టాళ్ళు ఉండే వైపుగా నడవటం మొదలెట్టాం. అక్కడ ఓ చిట్టి స్టాలుని చూడగానే టోబిన్ ఆగిపోయాడు- వాడి కళ్ళలోకి ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషి చాయ వచ్చింది కొంచెం.
"ఇదే!" అన్నాడు వాడు- "నేను ఇంక వేరే వాటిని మర్చిపోతాను. నా చెయ్యి చూపించుకుంటాను. సరిగ్గా నాకు కావలసింది దొరికింది. చూసావా, ఈవిడది 'నిల్లే' నట. నిల్లే వాళ్ళు చేతులు బాగా చూస్తారు. నాకు తెలుసు. అద్భుతమైన ఈ నిల్లే పామిస్టు ఏం చెబుతుందో చూద్దాం, ఆపైన జరగాల్సింది ఏదో, ఎట్లా జరుగుతుందో చూద్దాం" అన్నాడు.
టోబిన్‌కి శకునాలంటే మా చెడ్డ నమ్మకం. ప్రకృతిలోని అప్రాకృతిక అంశాలన్నా, సహజత్వంలోని అసహజాలన్నా వాడికి చాలా విశ్వాసం. నల్ల పిల్లుల గురించి, లక్కీ నెంబర్ల గురించీ, పేపర్లలో వచ్చే 'వాతావరణం' గురించీ వాడి మెదడులో అంత చట్టబద్ధం కాని నమ్మకాలు చాలానే ఉన్నాయి. 
'సరే, కానీలె'మ్మని మేం ఇక ఆ మంత్రాల కోళ్లగూడులోకి అడుగు పెట్టేసాం. గూటికి అడ్డుగా, నిగూఢత్వాన్ని మరింత పెంచుతూ, ఎర్రటి తెర ఒకటి కట్టి ఉన్నది. మిగిలిన మూడు వైపులా గోడలన్నిటినీ చేతులు ఆక్రమించి ఉన్నాయి. ఆ చేతులమీదంతటా అడ్డదిడ్డంగా, స్టేషన్లో రైలు పట్టాల మాదిరి, గీతలు ఉన్నై. గూటి తలుపుకు పైన ఉన్న బోర్డు చెప్పకనే చెబుతున్నది:"మేడం జోజో : ఈజిప్టు హస్తసాముద్రికం" అని. 
లోపల ఓ లావుపాటావిడ, ఎర్రటి జంపర్ ఒకటి వేసుకొని ఉన్నది. ఆ జంపర్  మీద వేడి వేడి కుండల్ని ఎత్తే ఇనప కమ్మీల బొమ్మలు, మంటలు కక్కే జంతువుల బొమ్మలు కుట్టి ఉన్నాయి. టోబిన్ ఆమెకు పది సెంట్ల డబ్బులు ఇచ్చి, తన చేతిని ముందుకు చాపాడు. బళ్ళు లాగే గుర్రం డెక్కలాగా ఉన్న టోబిన్ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆమె "చూద్దాం కుర్రాడా! నువ్వు ఇక్కడికి వచ్చింది కప్పలో దాక్కున్న రాయి కోసమో, నీ గుర్రపు డెక్కకు సరిపోలే నాడా కోసమో!" అన్నది.
ఆ వెంటనే ఆమె గొంతు మారిపోయింది.  "ఓహ్! దేవుడా! నీ అదృష్ట రేఖ స్పష్టంగా చెబుతోంది.." అని ఇంకేదో చెప్పబోయింది.
ఆలోగా తేరుకున్న టోబిన్ నమ్మకంగా "ఇది గుర్రపు కాలి డెక్క కానే కాదు మేడం., కచ్చితంగా మీ చేతిలో ఉన్నది నా చెయ్యే" అని చెప్పేసాడు.
"ఈ రేఖ చెబుతోందేమంటే..." అన్నది మేడం- "నీ జీవితంలోని ఈ క్షణానికి చేరుకోవటంలో నీ దురదృష్టపు పాత్ర ఉంది. అది ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఉంది రావాల్సింది! నీ శుక్ర స్థానం- అదేంటి, గాయం కాయ కట్టిందా,మరి?- అది ఏం చెబుతోందంటే, నువ్వు ప్రేమలో పడిపోయావు.  నువ్వు ప్రేమిస్తున్నవాళ్ళ వల్ల నీ జీవితంలోకి సమస్యలు వస్తున్నాయి.."
"ఈమె చెబుతున్నది కేటీ మహోర్నర్ గురించే, చూసావా..?" నా చెవిలోకి గుసగుసగా ఊదాడు టోబిన్, ఓ తొంభై డిగ్రీలు నా వైపుకు మళ్ళి.
"నాకు తెలుస్తోంది" అన్నది మేడం "నువ్వు మర్చిపోలేని వాళ్ల వల్ల నీకు అంతులేని దు:ఖం, చెప్పరానంత వేదన! నీ చేతిలోని సూచక రేఖలు స్పష్టంగా ఆమె పేరులోని K, M అనే అక్షరాల మీదికే తిరిగి కనిపిస్తున్నాయి"
"ఒహ్.. విన్నావా?" నా చెవిని అడిగాడు టోబిన్ "ఇప్పుడు ఆవిడ ఏం చెప్పిందో విన్నావా?"
"చూస్తూండు" అన్నది మేడం "నల్ల మనిషి ఒకడు, తెల్లటి ఆమె ఒకతె.. ఎందుకంటే వాళ్ళిద్దరూ నీకు సమస్యలు తెచ్చిపెట్టబోతున్నారు. త్వరలో నువ్వు నౌకా యానం చేస్తావు... ఆర్థికంగా నష్టపోతావు కూడా... ఒక్క రేఖ కనిపిస్తోంది నాకు.. అది నీకు అదృష్టాన్ని తెస్తుంది.. ఒక మనిషి రాబోతున్నాడు నీ జీవితంలోకి. అతను నీకోసం  అదృష్టాన్ని తేబోతున్నాడు. నువ్వు అతన్ని చూడగానే గుర్తు పడతావు- అతని ముక్కు వంకర తిరిగి ఉంటుంది!"
"అతని పేరు ఏమైనా కనిపిస్తున్నదా?" అడిగాడు టోబిన్. "ఏం లేదు, అదృష్టాన్ని నా మీద పడెయ్యటం కోసం అతను రాగానే, నేరుగా పలకరించేందుకు వీలుగా ఉంటుంది, కొంచెం అతని పేరు తెలిస్తే"
"ఉం.. అతని పేరు" అన్నది మేడం, ఆలోచిస్తున్నట్లు. "నీ చేతి గీతలు అతని పేరును సూటిగా చెప్పట్లేదు గానీ, 'అదేదో చాలా పొడుగుది' అని మటుకు  సూచిస్తున్నాయి. ఇంగ్లీషు అక్షరం V ఉంటుంది అతని పేరులో. ఇక ఇంతకంటే చెప్పేది ఏమీ లేదు. శుభ సాయంత్రం. తలుపు గట్టిగా వేయకండి" ముగించింది టకాలున.
మేమిద్దరం లేచి తలుపు దగ్గరికి వస్తుండగా "అన్నీ తెలుసు ఆమెకు, ఎంత అద్భుతం కదా!" అన్నాడు టోబిన్, నా చెవితో.
కొంచెం దూరం పోయామో లేదో నీగ్రోజాతి మనిషి ఒకడు కాలుస్తున్న సిగిరెట్టు టోబిన్ చెవిని ఇష్టపడింది. చురుకు తగిలిన టోబిన్ వాడి మెడని ఒడిసి పట్టాడు. వాడితో పాటు ఉన్న ఆడవాళ్లందరూ కేకలు పెట్టారు. సమయస్ఫూర్తితోటి నేను వాడిని విడిపించి, పోలీసులు వచ్చేలోగా టోబిన్‌ను అక్కడినుండి దూరం ఈడ్చుకెళ్ళాను.  ఎందుకోమరి, టోబిన్ సంతోషంగా ఉండాలంటే అతనికి ఇలాంటి చెత్త ఎదురవుతూనే ఉండాలి నిరంతరంగా.
వెనక్కి వెళ్ళేప్పుడు పడవ మనిషి "అయ్యా చక్కని పానీయాలు.. ఎవరికైనా కావాలాండి?!" అని అడిగేసరికి, టోబిన్‌కి దు:ఖం మళ్ళీ గుర్తుకొచ్చేసింది.  "కొంచెం తాగితే తప్ప ఈ మెదడుపైన తేలుతున్న చెత్త అంతా పోదు" అని జేబులు తడుముకొని చూస్తే ఏముంది, జేబులన్నీ ఖాళీ! 'సాక్ష్యం లేదు కదా' అని ఎవరో జేబులు కొట్టేసారు! బహుశా వాడు అక్కడ ఆ నీగ్రోతో పోరాడేటప్పుడు కావచ్చు, ఎవరో వీడి జేబులోని చిల్లరను డిస్టర్బు చేసేసారు.  దాంతో ఇక వేరే చేసేదేమీ లేక, మేమిద్దరం గొంతుల్ని అట్లాగే ఎండిపోనిచ్చుకుంటూ ఊరికే కూర్చున్నాం, పడవలోని చెక్క బల్లల మీద. పాపం, టోబిన్- మేం ఇంట్లోంచి బయలుదేరినప్పటికంటే వాడు ఇప్పుడు మరింత నిరుత్సాహంగా, తన దురదృష్టం పట్ల మరింత చింతతో ఉన్నాడు.
మాకు కొంచెం అవతలగా, రెయిలింగును ఆనుకొని ఒక యువతి కూర్చొని ఉన్నది. ఎర్రగా, బుర్రగా ఉంది. ఎర్రటి మోటారు సైకిళ్లకు వేయాల్సిన రంగు బట్టలు వేసుకున్నది. ఆమె జుట్టు టర్కీలో దొరికే ఒకలాంటి తెల్లమట్టి రంగులో ముద్ద ముద్దగా ఉంది.  అటువైపుగా పోతున్న టోబిన్ చూసుకోక, పాపం, ఆమె కాలుకు తట్టుకున్నాడు. ఎప్పుడు త్రాగినా, వాడు మామూలుగానే ఆడవాళ్ల పట్ల మర్యాదగా ఉంటాడు; అందుకని తన అలవాటు కొద్దీ ఆమె ముందు వంగి, తన టోపీ ఎత్తి ఆమెకు సారీ చెప్పి, మళ్లీ‌ ఆ టోపీని నెత్తిన పెట్టుకోబోయాడు. కానీ అది దాని ఇష్టం కొద్దీ వాడి తలమీద నిలవకుండా గాలికి కొట్టుకొనిపోయి, నీళ్లలో‌ తేలింది.
టోబిన్ దానికేసి ఒకసారి చూసి, మర్యాదగా వెనక్కి తిరిగి వచ్చి  తన సీట్లో‌ తను కూర్చున్నాడు.  నాకు వాడిని చూస్తే జాలి వేసింది. పాపం, వాడి దురదృష్టాలు రాను రాను మరింత ఎక్కువైపోతున్నాయి.  నిజమే కదా, అన్ని దురదృష్టాలు ఒకేసారి కమ్ముకున్నప్పుడు వాడు ఏం చేయగల్గుతాడు- మంచి డ్రస్ వేసుకొని కనిపించిన వాడిని కాలితో తంతాడు, లేకపోతే బోటును తనే సొంతగా నడిపేందుకు పోతాడు!
అయితే అంతలోనే టోబిన్ నా చేతిని ఊపుతో, నడుమును ఉత్సాహంగా కుళ్ళ బొడుస్తూ "జావ్..ఆ.ఆ..న్..న్" అన్నాడు. ఏంటన్నట్టు నేను వాడి ముఖంలోకి చూసా.  "మనం ఏం చేస్తున్నామో తెలుసా, నీకు అర్థం అయ్యిందా?" అన్నాడు వాడు మరింత ఉత్సాహంగా.
"ఏం చేస్తున్నాం?" అడిగాను నేను.
"మనం‌ నౌకాయానం చేస్తున్నాం!" అన్నాడు వాడు.
"ఉం..చాలు. ఆగు. ఈ చిట్టి పడవ మరో పది నిముషాల్లో‌ ఒడ్డు చేరుకుంటుంది" అన్నాను నేను.
"ఆవిడని చూసావుగా, బెంచీ మీది తెల్ల ఆవిడని? మరి నా చెవిని కాల్చేసిన ఆ నీగ్రోవాడిని మర్చిపోయావా? మరి నా దగ్గరున్న డబ్బులు- ఒక డాలర్ పైన యాభై ఐదు సెంట్లు- అవి పోయి ఆర్థిక నష్టంకూడా వాటిల్లింది, నాకు!!"
నష్టాలు ఎదురైనప్పుడు వాటిలో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తుంటారు మనుషులు. ప్రతివాడూ ఏదో ఒక సాకు కేసి చూపించేందుకు వీర ప్రయత్నం చేస్తాడు. అందుకని నేను "ఇవన్నీ‌ పెద్ద విషయాలు కావురా, చాలా చిన్నవి" అని చెప్పబోయాను.
"చూడు," అన్నాడు టోబిన్. "నీకు భవిష్యవాణి ఎంత గొప్ప విద్యనో తెలీదు, మహాత్ముల మహిమల మీద గౌరవమూ లేదు. నా చెయ్యి చూసి ఆ హస్త సాముద్రికం ఆవిడ నీకు ఏం చెప్పింది? అదంతా నీ కళ్ళముందే నిజమౌతున్నది. "'చూస్తూండు' అన్నదావిడ 'నల్ల మనిషి ఒకడు, తెల్లటి ఆమె ఒకతె.. ఎందుకంటే వాళ్ళిద్దరూ నీకు సమస్యలు తెచ్చిపెట్టబోతున్నారు' అని. నువ్వు అప్పుడే మర్చిపోయావా, ఆ నీగ్రో మనిషిని?- అయినా వాడిచ్చిన దానికి నేను కూడా నా పిడికిలితో కొంచెం బదులు ఇచ్చేసాననుకో; మరి ఈ పడవలో ఆవిడ కంటే తెల్లగా ఉన్న పిల్లని ఒక్కతెని చూపించు, ఆమె వల్లనే కదా, నా టోపీ ఎగిరి నీళ్లలో పడి కొట్టుకుపోయింది? ఇంక ఇదిగో, నా యీ జేబులో ఉండాల్సిన ఒకడాలర్ యాభై ఐదు సెంట్లు ఇప్పుడెక్కడున్నై, మనం‌ ఆ తుపాకీ వాడి దగ్గర్నుండి బయటికి వచ్చినప్పుడు ఇందులోనే కదా, ఉన్నవి?" అనేసాడు ఆవేశంగా.
టోబిన్ చెప్పిన ప్రకారం చూస్తే అవన్నీ నాకు హస్త సాముద్రికాన్ని సపోర్టు చేస్తున్నట్లే అనిపించినై కానీ, ఇంకో రకంగా చూస్తే 'యాదృచ్ఛికమైన ఈ సంగతులన్నీ కోనీస్ కి వెళ్ళినవాళ్ళకి ఎవరికైనా, సాముద్రికంతో‌ ఏ సంబంధమూ లేకుండా కూడా- జరగచ్చు' అనిపించింది. (కానీ నేను ఆ మాట టోబిన్ తో అనలేదు)
అంతలో టోబిన్ లేచి పడవ డెక్ మీద నడుస్తూ, కూర్చున్న వాళ్ళందరి మొహాల్లోకీ ఎర్రబారిన తన కళ్ళతో తొంగి చూడటం మొదలెట్టాడు.
అదైపోయినాక, వాడు వెనక్కి వచ్చి కూర్చోగానే 'మరి నువ్వు ఇప్పుడు చేపట్టిన ఈ చర్యలో అంతరార్థం ఏంటి' అని అడిగాను నేను. ఎందుకంటే టోబిన్ ఏ పనినైనా చేసేసేంతవరకూ అతని మనసులో ఏం నడుస్తోందో నీకుగానీ, మరెవ్వరికైనా గానీ తెలిసే అవకాశం లేదు.
"నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది.  నా చేతి గీతలు చెబుతున్న పరిష్కారాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను నేను. ఆ అదృష్టాన్ని తీసుకురావలసిన వంకర ముక్కువాడికోసం చూస్తున్నాను.  అదొక్కటే, ఇప్పుడు మనల్ని కాపాడేది.  జావ్..న్..న్- నీ జీవితంలో‌ ఎప్పుడన్నా ఈ పడవమీద ఉన్నంత పనికిమాలిన వాళ్ళను ఎప్పుడన్నా చూసావా? వాళ్లకు ఉన్నన్ని సూటి ముక్కులు ఈ భూ ప్రపంచంలోనే మరెవరికీ ఉండవేమో!"
మేం గట్టెక్కే సరికి తొమ్మిదిన్నర అయ్యింది. మిగిలినవాళ్లతో పాటు మేమిద్దరం కూడా పడవ దిగి, ఇరవై రెండో వీధిలో నడవసాగాము.  టోబిన్ తలమీద టోపీ లేదు..
ఆ వీధి మలుపులో, గ్యాస్ లైటు క్రింద నిలబడి, అక్కడినుండి ఎత్తుగా పోతున్న రోడ్డుని, ఆ రోడ్డు చివరన ఉదయిస్తున్న చంద్రుడిని ఏకదీక్షగా చూస్తున్న వ్యక్తి ఒకడు కనిపించాడు మాకు.  మనిషి పొడుగ్గా ఉన్నాడు; మంచి డ్రస్సే వేసుకొని ఉన్నాడు; నోట్లో‌ ఒక సిగార్ వెలుగుతున్నది; అన్నిటికంటే ముఖ్యంగా, అతని ముక్కు మొదటి నుండి చివరి వరకూ చేరుకునే లోపల పాము తిరిగినట్లు రెండు మంచి మెలికలు తిరిగి ఉంది! సరిగ్గా నేను దాన్ని చూసే సమయానికే టోబిన్ కూడా చూసాడు. చూసి, ఎంత గట్టిగా శ్వాసని ఎగబీల్చాడంటే, మీదినుండి జీనుని తొలగించగానే గట్టిగా నిట్టూర్చే గుర్రం గుర్తుకొచ్చింది, నాకు, ఒక్కసారిగా. మరుక్షణం అతను సూటిగా ఆ మనిషి దగ్గరికి వెళ్ళిపోయాడు చకచకా. నేనూ‌ అతన్ని అనుసరించాను.
"శుభ రాత్రి మీకు!" చెప్పాడు టోబిన్, ఆ మనిషికి. 
ఆ మనిషి తన నోట్లోంచి సిగారును బయటికి తీసి, మర్యాద కొద్దీ తను కూడా "శుభరాత్రి" అన్నాడు.
"మీ పేరు చెప్పండి" అడిగాడు టోబిన్ "అది ఎంత పొడుగు ఉందో చూడాలి మేము. మీతో పరిచయం చేసుకోవటం మా డ్యూటీ కావచ్చు"
"నా పేరు.." ఆగాడు ఆ మనిషి, కొంచెం ఆలోచిస్తున్నట్లు. "నా పేరు ఫ్రీడ్‌హాస్‌మాన్...- మాక్సిమస్ జి.ఫ్రీడ్‌హాస్‌మాన్"
"ఊ..! ఆమాత్రం పొడవు సరిపోతుంది" అన్నాడు టోబిన్. "నువ్వు దాన్ని పలికేటప్పుడు ఆ మొత్తం పొడవులో ఎక్కడైనా ఒక v పలుకుతుందా?"
"పలకదు" అన్నాడు ఆ మనిషి.
"సరే, కానీ నువ్వు దాని మొత్తం పొడవులో ఎక్కడైనా ఒకచోట 'వి' ని చేర్చి పలకగలవా?" అడిగాడు టోబిన్, కొంచెం కంగారుగా.
"ఒకవేళ నీ అంతరాత్మకు విదేశీ పదాల్ని ఉన్నవి ఉన్నట్లుగా పలకటం ఇష్టం లేకపోతే ఏమైనా చేర్చచ్చు.. నీ సంతోషం కోసం కావాలంటే 'వి' ని నా పేరులో చివరినుండి రెండో సిలబుల్‌కి ముందు చేర్చచ్చు" అన్నాడతను, కొంచెం కన్సెషన్ ఇస్తున్నట్టు.
"అంతమాత్రం అయితే చాలు" అన్నాడు టోబిన్ "మీరు ప్రస్తుతం డేనియల్ టోబిన్ మరియు జాన్ మెలోన్‌లతో మాట్లాడుతున్నారు" నమ్మకంగా చెప్పాడు.(కాల్ సెంటర్ వాళ్లలాగా)
"చాలా సంతోషం" అన్నాడతను, ముఖంలో‌ ఏమాత్రం  సంతోషం కనబడకుండానే వంగి అభివాదం చేస్తూ.  "సరే, మరి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ, ఈ వీధి మలుపులో 'స్పెల్లింగ్ బీ' పోటీ ఎందుకు పెడుతున్నారో నేను ఊహించుకోలేకపోతున్నాను. అందుకని, మరి, మీరు, ఇట్లా, తిరగకూడని సమయంలో ఎందుకు తిరుగుతున్నారో అడగచ్చునా నేను?" అన్నాడు అనుమానంగా.
"రెండు గుర్తులు" చెప్పాడు టోబిన్, వివరణ ఇస్తున్నట్లు. "మీలో కనబడుతున్నాయి. ఈజిప్టుకు చెందిన హస్త సాముద్రికురాలు నా చేతిలోని రేఖలు చదివి చెప్పిన గుర్తులు రెండు. నా చేతిలో ఉన్న సమస్యాత్మక రేఖల్ని, ఏవైతే నన్ను నీగ్రో మనిషి దగ్గరికీ, పడవలో కాళ్ళు చాపుకొని కూర్చున్న తెల్లామె దగ్గరికీ తీసుకెళ్ళాయో ఆ రేఖల్ని- అవి ఇంకో పని కూడా చేసాయిలే; ఒక డాలర్ పైన అరవై ఐదు సెంట్లు ఆర్థిక నష్టం కూడా కలిగించాయి- అవన్నీ ఇప్పటికే నిజమైనాయిలెండి- వాటన్నిటినీ తిరగరాసే అదృష్టాన్ని తీసుకొచ్చేందుకు గాను మీరు నామినేట్ చేయబడ్డారు"
ఆ మనిషి సిగార్ త్రాగటం ఆపి నావైపుకు చూసాడు.
"అతను చెప్పినదానిలో నువ్వేమైనా మార్పులు చేస్తావా, లేకపోతే నువ్వూ అదేనా?" అడిగాడతను "నిన్ను చూసి, 'అతన్ని నువ్వు అయితే కొంచెం కంట్రోలులో పెట్టగలవు' అనుకున్నాను"
"మార్పులు ఏమీ లేవు" చెప్పాను నేను "ఒక్క సంగతి చేరుస్తాను అంతే. ఎట్లా అయితే ఒక గుర్రపు నాడా మరో గుర్రపు నాడాను పోలుతుందో, అట్లాగే నా ఫ్రెండు చేతిలోని గీతలు చెబుతున్న అదృష్టపు ప్రతిబింబంతో నువ్వు కచ్చితంగా సరిపోతున్నావు. ఒకవేళ అట్లా కాలేదంటే, మరి డ్యానీ చేతిలో గీతలకు అడ్డుగీతలేమైనా ఉండి ఉండచ్చు, ఆ సంగతి నాకు తెలీదు".
"ఉం..అంటే మీరు ఇద్దరు ఉన్నారన మాట" అన్నాడు ఆ ముక్కున్న మనిషి పోలీసువాడు ఎవరైనా కనబడతారేమోనని ఆశగా రోడ్డు మీద ఆ చివరినుండి ఈ చివరిదాకా చూస్తూ "మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. శుభరాత్రి"
అనేసి అతను తన సిగార్‌ని మళ్ళీ తన నోట్లో దూర్చుకొని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రోడ్డు వెంబడి నడవటం మొదలెట్టాడు. కానీ‌ అతని ఒక జబ్బ వెంట టోబిన్, మరో జబ్బవెంట నేను- ఇద్దరమూ అతన్ని విడవకుండా వెంబడించటం మొదలెట్టాము.
"ఏంటి, మీకు అర్థం అవ్వట్లేదా?" అన్నాడతను, రోడ్డుకు అవతలి వైపున ఉన్న ఫుట్‌పాత్ మీదికి ఎక్కుతూ, కళ్ళకు అడ్డం పడుతున్న తన టోపీని సర్దుకుంటూ "మిమ్మల్ని కలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కానీ మిమ్మల్ని వదిలించుకోవాలని నాకు చాలా గట్టి కోరికగా ఉంది. నేను మా ఇంటికి పోవాలి.."
"పో! దానిదేముంది?!" అన్నాడు టోబిన్, అతని చొక్కా చేతిని పట్టుకొని వేళ్ళాడుతూ "తప్పకుండా‌ మీ ఇంటికే పో. నేను మటుకు మీ ఇంటి అరుగు మీదే కూర్చొని నువ్వు రేపు ప్రొద్దున బయటికి వచ్చేంత వరకూ‌ ఎదురు చూస్తూంటాను. ఎందుకంటే ఆ నీగ్రోవాడు, ఆ తెల్లామె, ఆ ఒకడాలరు అరవైఐదు నష్టమూ- వీటిని మూడింటినీ పూడ్చాల్సిన బాధ్యత నీదే, ఎలాగూ!"
నువ్వేదో చాలా వింత భ్రమలో ఉన్నట్లున్నావు" అన్నాడు ఆ మనిషి, నా కేసి తిరిగి. నేను కొంచెం ఆలోచించగలిగే పిచ్చోణ్ణి అనుకున్నట్లున్నాడు,"ఇప్పటికైనా నువ్వు అతన్ని ఇంటికి తీసుకు పోతే మంచిదేమో కదా?" అన్నాడు.
"ఓ, హెల్లో, చూడండి సర్!" అన్నాను నేను అతనితో "ఇంతకు ముందు ఎట్లా ఉండేవాడో, డానియల్ టోబిన్ ఇప్పుడూ అంతే బాగున్నాడు.  ఏదో, కొంచెం తాగాడు కాబట్టి ఒక మోస్తరు అటూ ఇటూగా ఉండచ్చు గానీ, వాడి తెలివి తేటలు పోయేంత ఏమీ కాలేదు. అయినా వాడు చేస్తున్నది ఏమీ‌ అతి కాదు- తన మూఢనమ్మకాలకు, తను ఎదుర్కొంటున్న కష్టాలకు తగిన న్యాయమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాడంతే. అవి మీకు తెలీదు కాబట్టి, నేను చెబుతాను; వినండి" అని నేను హస్తసాముద్రికం ఆవిడ గురించి, అనుమానం అనే చూపుడు వేలు లాభాన్ని చేకూర్చే దిశగా తీసుకెళ్ళే సాధనంగా అతన్ని ఎంత స్పష్టంగా సూచిస్తున్నదో మళ్ళీ‌ ఓసారి వివరించేసి, చివరగా "ఇదిగో, అర్థం చేసుకోండి, ఈ గందరగోళంలో నా పాత్ర ఏమిటో తెలుసుకోండి; నేను నా ఫ్రెండు టోబిన్ బెస్ట్ ఫ్రెండును అని అనుకుంటున్నాను: ధనికుడితో స్నేహం చెయ్యటం సులభం- ఎందుకంటే అందులో లాభం వస్తుంది కాబట్టి.  పేదవాడితో స్నేహం చెయ్యటం కష్టం కాదు- ఎందుకంటే వాళ్ళు చూపించే కృతజ్ఞతవల్ల మనం ఉబ్బిపోవచ్చు, బొగ్గు మసి పూసుకుని వాళ్ల ఇళ్ళముందు నిలబడి, అనాధలిద్దరిని చెరో చేత్తో పట్టుకొని ఫొటోలూ‌ దిగచ్చు.  కానీ పుట్టుకతోటే వెర్రివాడైన ఒక మనిషికి నిజమైన ఫ్రెండుగా ఉండటం అనేది స్నేహం అనే కళకే వన్నె తెస్తుంది.  అది ఎంత కష్టమో, నేను చేస్తున్నట్లు మీరు చేస్తేనే తెలుస్తుంది" అని చెప్పాను గట్టిగా. "కానీ, ఇదిగో, నా చేతిలోని గీతల్లో వీడికి ఉన్నట్లు అదృష్టం తన్నుకువచ్చేట్లు చేసే గుర్తులేవీ లేవు. అట్లానే నీకు న్యూయార్క్ నగరంలో అందరిలోకీ‌ ఎక్కువ వంకరలు తిరిగిన ముక్కు ఉంటే ఉండచ్చు గాక, కానీ ఇక్కడ ప్రాక్టీసు చేసే హస్తసాముద్రికం వాళ్ళు అందరూ నీనుండే అదృష్టాన్ని పితుక్కుంటామంటే దానికి సరిపోయేన్ని వంకరలు నీ ముక్కుకు కూడా ఉండక పోవచ్చు. కానీ డ్యానీ చేతిలోని రేఖలు మటుకు కచ్చితంగా నీ‌ వైపుకే చూపిస్తున్నాయి.  "నువ్వు ఎండిపోయావు- ఇంక అదృష్టాన్ని తేలేవు" అని మావాడికి నమ్మకం చిక్కేంతవరకూ, నీ‌పైన వాడు చేసే ప్రయోగాల్లో నేను వాడికే మద్దతు ఇస్తాను"
నేను ఇట్లా అనేసరికి వాడు అకస్మాత్తుగా నావైపు తిరిగి, నవ్వాడు. ఓ మూలకి పోయి, గోడల్ని ఆనుకొని, కడుపును  పట్టుకొని మరీ నవ్వాడు.  ఆ వెంటనే వాడు నన్ను, టోబిన్‌నీ వీఫుల మీద గట్టిగా చరిచి, నా చేతులు పట్టుకొని "అర్థమైంది. ఇది మొత్తం నాదే తప్పు.  ఇంత సున్నితమూ, ఇంత అద్భుతమూ అయినదేదో ఈ రోడ్డు మూలన వచ్చి నా నెత్తిమీద వాలుతుందని నేను ఎట్లా ఊహించగలను?  ఈ పరీక్షలో నేను ఫెయిలయేంత దగ్గరికి వెళ్ళాను.  ఇదిగో, ఇక్కడికి దగ్గర్లోనే ఒక చిట్టి, చక్కని హోటలు ఉన్నది. మీ తిక్క అలవాట్లను వినోదించటానికి అదే సరైన చోటు.  మనం అక్కడికి వెళ్ళి, తలా కొంచెం ఏమైనా త్రాగుతూ, ఇదమిద్ధంగా నిర్దుష్టంగా ఉన్నవంటూ ఏవీ లేనప్పుడు దేన్ని చర్చించచ్చో దాన్ని చర్చిద్దాం" అన్నాడు.
అట్లా అంటూనే అతను నన్ను, టోబిన్‌నీ అక్కడికి దగ్గర్లో ఉన్న బార్ లోకి తీసుకెళ్ళి, అక్కడ వెనకగా, ఎవరూ చికాకు పెట్టని ఓ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, సారాయిలు ఆర్డర్ చేసి, వాటి డబ్బులు తనే చెల్లించాడు కూడా.  ఆ పైన మాకు సిగార్లు వెలిగించి, తన సొంత తమ్ముళ్లని చూసినట్లు ఆప్యాయంగా చూసాడు మాకేసి:
"మీకు ఓ సంగతి చెప్పాలి. రాయటం అనేది నా వృత్తి. రకరకాలుగా రాస్తూండటం ద్వారా నాకు జరుగుబాటు అవుతుంటుంది. జనాలలోని తిక్కవ్యవహారాలనీ, పైలోకాల్లోని సత్యాన్నీ వెతుకుతూ నేను రాత్రుళ్ళలో రోడ్లమీదంతా చెడ తిరుగుతూంటాను. ఇవాళ్ల మీరు కనిపించే సమయానికి నేను- అదిగో, ఎత్తుగా పోతున్న ఆ రోడ్డుకు, రాత్రి పూట ప్రకాశానికి ప్రధాన కారణమైన వాడికీ మధ్య ఉన్న సంబంధం గురించిన తీవ్ర పరికల్పన మధ్యలో ఉన్నాను. కళ, కవిత్వం ఈ రెండూ అమిత వేగంతో చలించే వస్తువులు: మరి చంద్రుడు, అతి కష్టంమీద, ఎప్పుడూ తిరిగిన దారినే తిరిగే ఎండిపోయిన వస్తువు. అయితే ఇవన్నీ నా వ్యక్తిగత విశ్వాసాలు- ఎందుకంటే, కవిత్వపు వ్యాపారంలో పరిస్థితులన్నీ తిరగబడి కనిపిస్తుంటాయి.  నేను ఇట్లా జీవితంలో గమనించి కనుక్కున్న వింత విషయాలన్నీ కలిపి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను" అన్నాడు మా వాడి అదృష్ట మూర్తి.
"నన్ను కూడా నువ్వు రాయబోయే ఆ పుస్తకంలో పెడతానంటావు- అంతేనా?" అన్నాడు టోబిన్, అసహ్యంగా మొహం‌ పెడుతూ.
"నిన్ను చేర్చను" అన్నాడతను టక్కున. "ఎందుకంటే దాని కవర్ పేజీలో నువ్వు పట్టవు- కనీసం ఇప్పటికిప్పుడు. నిన్ను నా సంతోషంకోసం వినటమే నేను నీకు చేయగల అతి పెద్ద ఉపకారం. ఎందుకంటే ప్రింటు యొక్క పరిమితుల్ని నాశనం చేసేందుకు తగిన తరుణం ఇంకా రాలేదు. నువ్వు టైపులో అద్భుతంగా ఉంటావు- ప్రింటులో కాదు. ప్రస్తుతానికి నేనొక్కడినే గ్రోలవలసి ఉన్నది, సంతోషాల ఈ కప్పునుండి. కానీ, ధాంక్స్ అబ్బాయిలూ! మీకు నేను నిజంగా కృతజ్ఞుడిని!" అన్నాడు అతను పరవశంగా.
టోబిన్ గట్టిగా నిట్టూర్చి, ఇంకా గట్టిగా ఓ మాటు చీది, టేబుల్ మీద ధనామని గుద్ది చెప్పాడు- "నీ మాటలు నా ఓర్పుకు కంట్లోనలుసులు.  నీ ముక్కు వంకర నుండి నా అదృష్టం ఊడిపడుతుందని చెప్పారు కానీ, అట్లాంటి ఫలాలేవీ‌ నీ దగ్గరినుండి రాలతాయని నాకు అనిపించట్లేదు.  నిజానికి పుస్తకాల గురించిన నీ సణుగుడు, గాలి గట్టిగా వీచినప్పుడు గోడకున్న పగులు చేసే రొదలాగా అనిపిస్తున్నది.  నిజమే, నా చేతి గీతలు ఈ ఒక్కసారికీ నన్ను మోసం చేసాయని నేను నమ్మేస్తాను; కేవలం ఆ నీగ్రోవాడి రాక, తెల్లయువతి రాక మటుకు నిజమే ఐనాయనుకో- అయినా సరే-.." అని ఆవేశంకొద్దీ‌ ఇంకా ఏదో చెప్పబోయాడు.
"ఉష్.." అని నోటిమీద వేలు వేసుకున్నాడు వంకరముక్కు వాడు- "కేవలం కనుముక్కు తీరును పట్టుకొని మిమ్మల్ని మీరు తప్పుదోవ పట్టించుకుంటారా? కొన్ని పరిమితులకు లోబడి, నా ముక్కు ఏం చేయగల్గుతుందో అది చేస్తుంది ఎలాగూ.  ప్రస్తుతానికి మన గ్లాసుల్ని మళ్ళీ ఒకసారి నింపమందాం, ఎందుకంటే వైచిత్ర్యాలను ఎప్పుడూ కొంచెం తేమ చేర్చి జారేట్లు ఉంచుకోవటం మేలు- పొడిబారిపోయిన నైతిక వాతావరణంలో అవి ఒకింత క్షీణతకు గురై నశించే అవకాశం ఉంటుంది" అన్నాడు.
అట్లా, ఆ కవిత్వం వాడు నా ఉద్దేశం ప్రకారం తన తప్పును దిద్దుకున్నాడు- అంటే మళ్ళీ బిల్లు కట్టాడన్నమాట. నవ్వు ముఖంతో, ఉత్సాహంగా, మేం అందరం తాగిన మొత్తానికీ. మరి జాతకం ప్రకారం నా దగ్గర, టోబిన్ దగ్గర ఉండే పెట్టుబడి అంతా ఊడ్చిపెట్టుకు పోయింది గద- అందుకని మేం బిల్లు కట్టే మొహమాటానికి పోలేదు. అయితే టోబిన్ బాధ పడ్డాడు- అందుకనేనేమో, అటుపైన అంతా నిశ్శబ్దంగా త్రాగుతూ పోయాడు; కళ్ళు కొద్ది కొద్దిగా ఎర్రగా అయినాయి.
అట్లా చివరికి మేం ఆ బార్ నుండి బయటికి వచ్చి, రోడ్డు ప్రక్కగా కాలిబాట మీద నిలబడ్డాం. సమయం రాత్రి పన్నెండు దాటింది. 
"ఇంక నేను పోతాను, ఇంటికి" అన్నాడు ఆ మనిషి. "మీరు కూడా అటువైపునుండే వెళ్తామంటే మరి అటే రండి, కలిసి మాట్లాడుకుంటూ‌ పోదాం" అన్నాడు. అందరం కలిసి నడిచాం.
అక్కడికి రెండు బ్లాకుల అవతల ఒక ప్రక్క వీధిలోకి మళ్ళాం ముగ్గురం. అక్కడ వరసగా ఇటుకల ఇళ్ళు ఉన్నాయి కొన్ని, అన్నిటికీ ఎత్తైన మెట్లు, ఇనప కంచెలు ఉన్నై.  వాటిలో ఒక దాని ముందు ఆగి, అతను తల పైకెత్తి చూసాడు. ఇళ్ళ అంతస్తు కిటికీలన్నీ నల్లగా చీకటిలో మునిగి ఉన్నాయి-
"ఇదే మా ఇల్లు" అన్నాడతను. "శకునాలని బట్టి చూస్తే మా ఆవిడ పడుకున్నదని అర్థం అవుతున్నది. అందుకని నేను కొంచెం అతిథి సేవ చేయచ్చు అనిపిస్తున్నది. నేనేమంటానంటే, మీరు ఏమీ అనుకోకుండా మా బేస్‌మెంట్ రూముకు విచ్చేయండి. సాధారణంగా మేం భోజనాలూ అవీ చేసేది అక్కడే. అందుచేత, మీరు తినగలిగే ఏ కొద్దో గొప్పో తిండి కొంత మనకు అక్కడ దొరుకుతుందని నా అనుమానం. కొద్దో గొప్పో అంటే నా ఉద్దేశం, చల్లారిపోయిన కొన్ని చికెన్ పీసులూ, కొంత జున్నూ, ఒకట్రెండు సీసాల యాపిల్ జ్యూసూ అన్నమాట.  మీరు ఇంతసేపు నాకు చక్కని వినోదం కల్పించారు కాబట్టి నేను మీకు ఇంత మాత్రమైనా రుణపడే ఉంటాను"
మా ఇద్దరి కడుపుల్లో ఆకలి, మా మనోస్థితి కూడా ఈ ప్రతిపాదనకు సుముఖంగానే స్పందించాయి. "ఈ కొద్దిపాటి సారాయిలూ, చల్లారిపోయిన భోజనమూ- ఇవి నా హస్త రేఖలు సూచించే అదృష్టానికి సూచికలు ఎలా ఔతాయి?" అని డ్యానీ గాడి అంతరాత్మ క్షోభిస్తూనే ఉందనుకోండి, అయినా.
మీరు ఈ మెట్లు దిగి అక్కడ నిలబడండి- నేను పైనుండి ఇంట్లోకి వెళ్ళి, అటు వైపు నుండి తలుపు తీస్తాను. మీరు నేరుగా మా డైనింగు హాల్లోకి వచ్చేస్తారు" అన్నాడతను మమ్మల్ని క్రిందికి నెడుతూ. "మాకు కొత్తగా మూడు నెల్ల క్రితమే వచ్చి చేరింది ఓ చక్కని వంటమ్మాయి- అనుభవం అంతగా లేకపోయినా చక్కటి కాఫీ పెడుతుంది. కేటీ మహోర్నర్ అని ఆ అమ్మాయి పేరు- వంట బానే చేస్తుంది. మీకు ఇవాళ్ళ ఆమె చేతి కాఫీ కూడా రుచి చూపిస్తాను..."
మావాడి అదృష్టానికి నేను బిత్తర పోయాను- ఇక మావాడి ముఖంలోనైతే కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు!

No comments:

Post a Comment